ఏపీకి మరో తుఫాన్ ముప్పు!
బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం... 15న వాయుగుండంగా మారే అవకాశం... తుఫాన్‌గా మారితే ‘అక్వాన్’గా నామకరణం...

విజయవాడ, నవంబర్ 13 : ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల 14న తీవ్ర అల్పపీడనంగా, 15న వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం మరింత బలపడి తుఫాన్‌గా రూపాంతరం చెందవచ్చని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. తుఫాన్‌గా మారితే దీనికి 'అక్వాన్' అనే పేరు పెట్టే అవకాశం ఉంది. ఈ నెల 15 నుంచి 17 వరకు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రత పెరిగి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 65 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తుఫాన్ కచ్చితంగా ఏర్పడుతుందా, ఉత్తర కోస్తా వైపు వస్తుందా, 19వ తేదీ సాయంత్రం తీరం దాటుతుందా అనే అంశాలపై ఇంకా అధికారిక నిర్ధారణ లేదు. వాతావరణ వ్యవస్థ కదలికలను బట్టి రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను అనుసరించాలని సూచిస్తున్నారు.

