అమరావతి భూములకు బంగారు భవిష్యత్!
రాబోయే రోజుల్లో భూముల ధరలు భారీగా పెరుగుతాయి... ఎకరం రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లకు చేరే అవకాశం... హైదరాబాద్ అభివృద్ధిని ఉదాహరణగా ప్రస్తావించిన సీఎం...

విశాఖపట్నం, నవంబర్ 13 : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాబోయే రోజుల్లో ఎకరం భూమి ధర రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు పలికే అవకాశం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన రాజధాని అభివృద్ధి, భూముల విలువ పెరుగుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో హైదరాబాద్‌లో ఎకరం భూమి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉండేదని, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇప్పుడు అదే భూమి విలువ కోట్ల రూపాయలకు చేరిందని గుర్తుచేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు సైబరాబాద్‌ను అనుసంధానించడం, ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయం, ఐటీ రంగం వంటి భారీ ప్రాజెక్టుల కారణంగా భూముల విలువ గణనీయంగా పెరిగిందన్నారు. అదే తరహాలో అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు విస్తరించే కొద్దీ భూముల విలువ కూడా పెరుగుతుందని వివరించారు. అమరావతిలో ఎకరం రూ.100 కోట్ల వరకు పలకవచ్చన్నది భవిష్యత్తుపై తన అంచనా అని చంద్రబాబు పేర్కొన్నారు.

