68 మందికి రూ.56.30 లక్షల ఆర్థిక భరోసా!
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొండా ఉమా… సెంట్రల్‌లోని 29 డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు చేయూత… పేదల వైద్య ఖర్చుల భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం…

విజయవాడ, అక్టోబర్ 14: అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం సింగ్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 29 డివిజన్లకు చెందిన 68 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.56.30 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అనారోగ్యం కారణంగా కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని, ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి సకాలంలో ఆర్థిక సహాయం అందేలా అధికారులతో సమన్వయం చేస్తున్నామని వివరించారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు పేదల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల నాయకులు, పార్టీ ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

