మేయర్ బరిలో బొండా సిద్ధార్థను నిలపాలి
యువ నాయకుడికి అవకాశం ఇవ్వాలని రజక సంఘాల ఏకగ్రీవ తీర్మానం… విద్య, ప్రజాసేవ, రాజకీయ అనుభవం ఆయనకు అదనపు అర్హతలని వెల్లడి… చంద్రబాబు, లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తామని సంఘాల నాయకుల ప్రకటన…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 2: విజయవాడ నగర మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలని నగరంలోని రజక సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. యువకుడు, విద్యావంతుడైన సిద్ధార్థ నాయకత్వంలో విజయవాడ మరింత అభివృద్ధి సాధిస్తుందని సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు. దుర్గాపురంలోని రజక కల్యాణ మండపంలో రజక సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. రజక చైతన్య సేవా సంస్థ అధ్యక్షుడు కొండపల్లి రూప్‌కుమార్ నాని, నయినవారపు చలం, రాష్ట్ర రజక నాయకుడు భవిరి సింహాచలం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వాల్తేరు దుర్గాప్రసాద్ తదితరులు మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉన్న విజయవాడను ఆధునిక నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, రహదారులు, పారిశుద్ధ్యం, పార్కులు, వీధి దీపాలు, తాగునీరు తదితర మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రజలతో నిరంతరం మమేకమయ్యే సమర్థ నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. బొండా సిద్ధార్థ యువకుడు, విద్యావంతుడు కావడంతోపాటు నగర సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన నాయకుడని తెలిపారు. విదేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ అనేక సంవత్సరాలుగా రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రాజకీయ ప్రస్థానంలో

దాదాపు 15 సంవత్సరాలుగా కీలకంగా పనిచేస్తూ నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారని వివరించారు. సిద్ధార్థ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు, పేదలు, నిరుపేద కుటుంబాలకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న పీ–4 విధానంలో భాగంగా పేద కుటుంబాలకు జీవనోపాధి కల్పించే కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొంటున్నారని తెలిపారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా సేవా కార్యక్రమాల్లో భాగస్వామిగా ప్రజల ఆదరణ పొందుతున్నారని చెప్పారు. విజయవాడకు ఆధునిక రూపాన్ని తీసుకురావాలంటే యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మంత్రి నారా లోకేశ్ యువతను రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో బొండా సిద్ధార్థకు మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనకు అవకాశం ఇస్తే నూతన ఆలోచనలు, ఆధునిక ప్రణాళికలతో నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. నగరంలోని వివిధ సామాజిక సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులతో సమావేశాలు నిర్వహించి సిద్ధార్థ అభ్యర్థిత్వానికి మద్దతు కూడగడతామని ప్రకటించారు. సమావేశంలో రజక సంఘాల నాయకులు మాచర్ల గోపి, పతివాడ రాము, గాతవలస మురళి, మంటాడ శివ, మల్లంపల్లి సురేశ్, చందలూరి నాగయ్య, ఆధాపాక అప్పారావు, నారాయణ, అంతరకొండ సత్యనారాయణ, భీమవరపు కోటేశ్వరరావు, ఆవులమంద వీరబాబు, రొంపవలస అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

