ఇంద్రకీలాద్రిపై తప్పిపోయిన చిన్నారి.. 20 నిమిషాల్లో తల్లికి అప్పగింత!
దసరా ఉత్సవాల్లో పోలీసుల అప్రమత్తత... క్యూలైన్‌లో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన చిన్నారి... వేగంగా స్పందించి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన పోలీసులు...

విజయవాడలోని దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన చిన్నారి తన తల్లితో కలిసి క్యూలైన్‌లో వెళ్తుండగా తప్పిపోయింది. చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి వివరాలు సేకరించారు. సమన్వయంతో పనిచేసిన పోలీసులు కేవలం 20 నిమిషాల్లోనే చిన్నారిని గుర్తించి సురక్షితంగా తల్లి చెంతకు చేర్చారు. చిన్నారి క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వేగంగా స్పందించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దసరా రద్దీలో పోలీసుల అప్రమత్తత, సమన్వయం మరోసారి స్పష్టమైంది.

