బెజవాడ ఉత్సవ్‌లో మిన్నంటిన ఉత్సాహం!
ప్రేక్షకుల కేరింతలతో మారుమోగిన బసవ పున్నయ్య స్టేడియం… ఉర్రూతలూగించిన సంగీత, నృత్య ప్రదర్శనలు… ప్రత్యేక ఆకర్షణగా బాణసంచా విన్యాసాలు… విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటుతాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు…

విజయవాడ, అక్టోబర్ 11: కృష్ణమ్మ తీరాన విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు అంబరాన్నంటాయి. మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో నిర్వహించిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ప్రముఖ గాయని గీతా మాధురి తన గానంతో యువతలో ఉత్సాహాన్ని నింపారు. ఆమె ఆలపించిన పాటలకు యువత కేరింతలు కొడుతూ సందడి చేశారు. కామ్రేడ్ కళ్యాణ్ చిత్ర బృందం అందించిన కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రేక్షకుల చప్పట్లు, ఈలలు, కేరింతలతో స్టేడియం మారుమోగింది. కార్యక్రమం చివర్లో నిర్వహించిన బాణసంచా విన్యాసాలు కనువిందు చేశాయి. ఈ వేడుకలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కార్పొరేషన్ చైర్మన్ గొట్టుముక్కల రఘు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విజయవాడకు ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టతను దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ఇటువంటి ఉత్సవాలు దోహదపడతాయన్నారు. కళలు, సంస్కృతి వైపు యువతను ఆకర్షించడంతో పాటు నగర పర్యాటక రంగానికి ఈ వేడుకలు కొత్త ఊపు తీసుకువస్తాయని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ స్థానిక కళాకారులకు వేదిక కల్పించడం, యువతలోని ప్రతిభను వెలికితీయడం విజయవాడ ఉత్సవ్ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్ నగర ప్రజలకు వినోదంతో పాటు సాంస్కృతిక అనుభూతిని అందిస్తోందన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ నగర ఐక్యతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. సంగీత ప్రదర్శనలు, నృత్యాలు, బాణసంచా విన్యాసాలతో స్టేడియం ఆద్యంతం సందడిగా మారింది.

