స్వచ్ఛ సమాజ నిర్మాణమే గాంధీజీకి నిజమైన నివాళి
సత్యం, అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలి… గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఘన నివాళులు… పేదలకు దుప్పట్లు, పండ్లు, మిఠాయిలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొండా ఉమా…



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, శాంతి, అహింసా మార్గాలు ప్రపంచానికే ఆదర్శమని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే గాంధీజీకి అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం సెంట్రల్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో బొండా ఉమా పాల్గొన్నారు. కస్తూర్బాయిపేట గాంధీ బొమ్మ సెంటర్, సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్, పైపుల రోడ్డులోని గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు, పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యాగ్రహం, అహింసలను ఆయుధాలుగా చేసుకొని గాంధీజీ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించారని చెప్పారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం


చేయడంతోపాటు గ్రామాలు, పట్టణాలు, డివిజన్లను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు విస్తృతంగా అమలవుతున్నాయని తెలిపారు. గాంధీజీ సిద్ధాంతాలు, దేశానికి ఆయన చేసిన సేవలను భావితరాలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. పైపుల రోడ్డు సెంటర్‌లో గాంధీ విగ్రహ ఏర్పాటుకు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చర్యలు తీసుకున్నట్లు బొండా ఉమా గుర్తుచేశారు. అప్పటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. గాంధేయ మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్లు, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, ఇన్‌చార్జులు, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

