స్థానిక నాయకత్వ అభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక
స్థానిక ఎన్నికల్లో నూరుశాతం విజయమే లక్ష్యమన్న ఎమ్మెల్యే రాము… గుడివాడ రూరల్, నందివాడ మండల నాయకులతో సమావేశాలు… అభిప్రాయ భేదాలు పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని పిలుపు…

గుడివాడ, అక్టోబర్ 17: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాదరణ ఉన్న అభ్యర్థులను స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా ఎంపిక చేస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. నాలుగు గోడల మధ్య అభ్యర్థులను నిర్ణయించే విధానానికి తాను వ్యతిరేకమని, అందరితో చర్చించి ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాల కంటే పార్టీ ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యమిస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుడివాడ రూరల్ మండలం చౌటుపల్లిలో మండల టీడీపీ నాయకులతో, గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో నందివాడ మండల నాయకులతో రాము సమావేశమయ్యారు. గ్రామాల్లో పార్టీ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నద్ధత, నాయకుల మధ్య సమన్వయంపై చర్చించారు. స్థానిక ఎన్నికల్లో నూరుశాతం విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ వివరించాలని రాము కోరారు. బుడమేరు వరదల సమయంలో బాధితులకు కూటమి కార్యకర్తలు అందించిన సేవలను గుర్తుచేశారు. నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని సుమారు 90 శాతం గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని రాము తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి వీధిలో మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా దశలవారీగా పనులు చేస్తున్నామన్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారుల పనులపై ప్రజల్లో అసంతృప్తి ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని, పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. నిధులు, ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన ప్రక్రియలను ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు. చిన్న సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. పార్టీలో అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గుడివాడను ప్రత్యేకంగా నిలిపేలా కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశాల్లో వాసే మురళి, దానేటి సన్యాసిరావు, అమర్‌బాబు, అంగడాల శీను, పట్టెం అంజయ్య, చాట్రగడ్డ రవికుమార్, సాల్మన్‌రాజు, యార్లగడ్డ రవి, పాలడుగు ధర్మపాల్ తదితరులు పాల్గొన్నారు.

