విద్యార్థి దశ నుంచే సేవాభావం అలవర్చుకుంటే దేశ ప్రగతికి తోడ్పాటు
విద్యార్థి దశ నుంచే సేవాభావం అలవర్చుకోవాలని పిలుపు... స్పందన మానసిక వికాస కేంద్రంలో అభిన్ పుట్టినరోజు వేడుకలు... ప్రత్యేక అవసరాల చిన్నారులతో ఆనందాన్ని పంచుకున్న కుటుంబ సభ్యులు...

గన్నవరం: విద్యార్థి దశ నుంచే సేవాభావం, సామాజిక బాధ్యతను అలవర్చుకుంటే భవిష్యత్తులో దేశ ప్రగతికి తోడ్పడే బాధ్యతాయుతమైన యువతగా ఎదుగుతారని హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ చైర్మన్ సంకాబత్తుల వెంకట్ అభిప్రాయపడ్డారు.
గన్నవరం మండలం దావాజిగూడెంలో హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందన మానసిక వికాస కేంద్రంలో మంగళవారం వెంకట్ మేనల్లుడు బావిశెట్టి అభిన్ పుట్టినరోజు వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
విద్యార్థులు చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వాములు కావాలని వెంకట్ సూచించారు. సేవాభావం, మానవతా విలువలు, సామాజిక బాధ్యత వంటి లక్షణాలను విద్యార్థి దశలోనే అలవర్చుకోవడం ద్వారా సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగవచ్చని పేర్కొన్నారు.
అభిన్ జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రత్యేక అవసరాల చిన్నారులతో కలిసి పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సెక్రటరీ రజిత వెంకట్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

