ఒకే కుటుంబం ఓట్లు.. ఒకే పోలింగ్ స్టేషన్‌లో!
ఫారం-8 సమర్పించి కుటుంబ సభ్యుల ఓట్లను ఒకే కేంద్రానికి మార్చుకునే అవకాశం... ఆగస్టు 29 వరకు అభ్యంతరాల స్వీకరణ.. సెప్టెంబర్ 28లోపు పరిష్కారం... అక్టోబర్ 3న తుది జాబితా.. మచిలీపట్నంలో 223కు పెరిగిన పోలింగ్ కేంద్రాలు...

V10TV మచిలీపట్నం (ప్రతినిధి): ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ-2026లో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గ ఓటర్ల జాబితాపై బుధవారం సాయంత్రం స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఆర్డీవో అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రతి ఓటరు తమ పేరు ఉందో లేదో ముందుగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. పేరులో అక్షర దోషాలు, చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాల్లో తప్పులు ఉన్నా, జాబితాలో పేరు లేకపోయినా సంబంధిత బీఎల్‌వో, ఈఆర్వో, ఏఈఆర్వో, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో కార్యాలయాల్లో ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు.
ఓటర్ల జాబితాపై ఆగస్టు 29 వరకు అభ్యంతరాలు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. స్వీకరించిన అభ్యంతరాలను ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 28లోపు పరిశీలించి పరిష్కరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ముసాయిదా జాబితాలను ఎన్నికల అధికారుల కార్యాలయాలు, బీఎల్‌వోల వద్దతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
కొత్త ఓటు నమోదు కోసం ఫారం-6, ఓటు తొలగింపు కోసం ఫారం-7, ఓటరు వివరాల సవరణ, చిరునామా మార్పు కోసం ఫారం-8 సమర్పించాలని అధికారులు వివరించారు. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉంటే ఫారం-8 ద్వారా వాటిని ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలోకి మార్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో గతంలో 205 పోలింగ్ స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 223కు పెరిగినట్లు సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో షేక్ సిలార్ దాదా, ఇమడాబత్తుల దిలీప్, గాజుల భగవాన్, బోరా సుబ్రహ్మణ్యం, చల్లాది రామకృష్ణ, మేడంపూడి అనిల్‌బాబు, అబ్దుల్ మతిన్, మట్ట నాంచారయ్య, పల్లి శేఖర్, రమేష్, గడ్డం రాజుతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు

