వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన
వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం... కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం... ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన...

అమరావతి, ఆగస్టు 13: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఈ అల్పపీడనం పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ గురువారం సాయంత్రంలోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
దీని ప్రభావంతో రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణం నెలకొనడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు సూచించింది.

