మహిళ వైద్యానికి రూ.3.90 లక్షల చేయూత
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎల్ఓసీ మంజూరు… నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళకు వైద్య సహాయం… ఎల్ఓసీ పత్రాన్ని అందజేసిన అడ్డూరి శ్రీరామ్, ప్రత్తిపాటి శ్రీధర్…

విజయవాడ, నవంబర్ 11: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.3.90 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) మంజూరైంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో మంజూరైన ఎల్ఓసీ పత్రాన్ని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు, 49వ డివిజన్ కార్పొరేటర్ అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నాయకులతో కలిసి అందజేశారు. పంజా సెంటర్కు చెందిన కూరాకుల వసుంధర రమాదేవి (52) కాలికి ఇన్ఫెక్షన్ సోకడంతో పాటు నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.3.90 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరైంది. వైద్య సహాయం కోసం చేసిన విజ్ఞప్తిపై త్వరితగతిన స్పందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దుర్గాప్రసాద్, లింగం శివప్రసాద్, గొట్టం సాంబశివరావు, పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, దుర్బేసుల హుస్సేన్, బొల్లెపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

