ఇంద్రకీలాద్రిపై గాజుల అలంకరణ వైభవం
కనులపండువగా కనకదుర్గమ్మ గాజుల అలంకరణ మహోత్సవం… అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈవో శీనా నాయక్ దంపతులు… ఆధ్యాత్మిక శోభతో దేవస్థాన ప్రాంగణం.. ఏర్పాట్లపై భక్తుల ప్రశంసలు…

విజయవాడ, నవంబర్ 11: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో బుధవారం గాజుల అలంకరణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకంగా గాజులతో అలంకరణ చేపట్టడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాజుల అలంకరణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలోని వివిధ ప్రాంతాలను గాజులతో అలంకరించారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈవో శీనా నాయక్ దంపతులు ఆలయంలో ఏర్పాట్లను తిలకించారు. గాజుల అలంకరణతో ఆలయంలో పండుగ వాతావరణం నెలకొందని పలువురు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. దేవస్థాన ప్రాంగణంలో చేసిన అలంకరణలు, ఆధ్యాత్మిక వాతావరణానికి అనుగుణంగా చేపట్టిన ఏర్పాట్లపై ఈవో శీనా నాయక్‌ను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. అమ్మవారి ఆలయంలో ఇటువంటి ఉత్సవాలు భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

