విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం… ఉర్దూ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్ కిట్లు అందజేత… ఆజాద్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు…

విజయవాడ, నవంబర్ 11: దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని బుధవారం విద్యాధరపురంలో విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. 32వ డివిజన్ తుళ్లూరు వారి వీధిలోని ఉర్దూ పాఠశాలలో రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ హయత్ షరీఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్ కిట్లు, చాక్లెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో, స్వాతంత్ర్యానంతరం విద్యారంగ అభివృద్ధిలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి పొదిలి చంటిబాబు, ఎస్ఈసీ సభ్యులు డీజీపీ కెన్నెడీ, షేక్ బషీర్ అహ్మద్, రుద్ర శంకర్, ఉస్తెల చలపతిరావు, షేక్ రహీమ్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

