స్థానిక పోరుకు సిద్ధం కండి
బలమైన అభ్యర్థులను వేగంగా గుర్తించాలని జగన్ ఆదేశం అందరి అభిప్రాయాలతో అభ్యర్థుల జాబితాలు రూపొందించాలని సూచన ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని పిలుపు

తాడేపల్లి, సెప్టెంబర్ 24: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైన, ప్రజాదరణ కలిగిన అభ్యర్థులను వేగంగా గుర్తించాలని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో గురువారం నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎన్నికల సన్నద్ధతపై ఆయన దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపికలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు ఎన్నికల్లోనూ పార్టీకి ఉపయోగపడేలా ఉండాలన్నారు. పార్టీలోని అన్ని స్థాయుల నాయకులతో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించాలని సూచించారు. పలుదఫాలుగా చర్చించిన తరువాత అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేయాలని, పార్టీ శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఎన్నికల్లో ముందుకు నడిపించాలని చెప్పారు. స్థానిక నాయకత్వం పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆదేశించారు. ప్రతి గడపకూ వెళ్లి గత వైఎస్సార్‌సీపీ పాలనలో చేసిన మంచిని ప్రజలకు వివరించాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన నష్టాలు, కష్టాలు, ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పోలీసు బలాన్ని ఉపయోగించుకొని అడ్డదారుల్లో ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ ప్రయత్నించే అవకాశం ఉందని జగన్ ఆరోపించారు. వాటిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని, ప్రతి చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రాంతీయ సమన్వయకర్తలకు సూచించారు. సమావేశంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.

