శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి… ఆలయ కమిటీలు, అధికారుల సమన్వయం అవసరం… ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, అక్టోబర్ 10: శరన్నవరాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సూచించారు. శనివారం రాజేంద్రనగర్‌లోని తన స్వగృహంలో దేవాదాయ శాఖ అధికారులు, వివిధ ఆలయాల కమిటీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా పలు ఆలయాల ఉత్సవ బుక్లెట్లను ఆవిష్కరించారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ

ఆలయాల వద్ద పారిశుధ్యం, తాగునీరు, క్యూలైన్లు, భక్తులరాకపోకలకు అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గుడివాడ ఆధ్యాత్మిక ప్రాధాన్యతను మరింత పెంపొందించేలా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, దేవాదాయ శాఖ ఈవో కందుల గోపాలరావు, వివిధ ఆలయాల చైర్మన్లు, వేద పండితులు, అధికారులు పాల్గొన్నారు.

