తుఫాను వేళ కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ
రాత్రి ఎనిమిది నుంచి ఉదయం ఐదు గంటల వరకు నిరంతర పర్యవేక్షణ ప్రతి గంటకూ క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులతో సమీక్ష ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలకు ఆదేశాలు

విజయనగరం, సెప్టెంబర్ 24: తుఫాను ముప్పు నేపథ్యంలో విజయనగరం జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి రాత్రంతా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌లోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షించారు. బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు కంట్రోల్ రూమ్‌కు చేరుకున్న కలెక్టర్ గురువారం ఉదయం ఐదు గంటల వరకు అక్కడే ఉన్నారు. జిల్లాలోని పరిస్థితులపై ప్రతి గంటకూ ఆరా తీస్తూ క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. తుఫాను కారణంగా ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన దూరవాణి సమావేశంలోనూ కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాపై తుఫాను ప్రభావం, చేపట్టిన సహాయక చర్యలు, అధికార యంత్రాంగం సన్నద్ధతను ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్‌తోపాటు జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, ఉప కలెక్టర్ అంబరీష్, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవ్‌ప్రసాద్, ఇతర అధికారులు రాత్రంతా విధులు నిర్వహించారు.

