మీడియాకు ఇక ‘స్మార్ట్’ గుర్తింపు
క్యూఆర్ కోడ్ డిజిటల్ పాస్‌తో క్షణాల్లో జర్నలిస్టుల ధృవీకరణ నకిలీ మీడియా పాస్‌లకు చెక్ పెట్టేలా నెల్లూరు పోలీసుల కొత్త విధానం త్వరలో తిరుపతిలోనూ అమలుకు సన్నాహాలు

మీడియా ప్రతినిధుల గుర్తింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సురక్షితంగా మార్చే దిశగా నెల్లూరు జిల్లా పోలీసులు కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. జర్నలిస్టుల వివరాలను క్షణాల్లో ధృవీకరించేలా క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ మీడియా అక్రిడిటేషన్ వ్యవస్థను నెల్లూరు ఎస్పీ డా. అజిత వెజెండ్ల ప్రారంభించారు. ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ డిజిటల్ పాస్‌ను స్కాన్ చేయగానే సంబంధిత మీడియా ప్రతినిధి వివరాలను ధృవీకరించే అవకాశం ఉండనుంది. దీనివల్ల నకిలీ మీడియా పాస్‌ల వినియోగానికి అడ్డుకట్ట వేయడంతో పాటు అధికారిక మీడియా ప్రతినిధులను సులభంగా గుర్తించేందుకు వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. మీడియా ప్రతినిధుల అభ్యర్థన మేరకు సోమవారం నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మరోసారి క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇదే తరహా స్మార్ట్ మీడియా గుర్తింపు విధానాన్ని త్వరలో తిరుపతిలోనూ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే తిరుపతిలో అమలు తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

