దసరా వేళ ట్రాఫిక్‌పై పోలీసుల ప్రత్యేక నిఘా
వీఐపీల రాకపోకల నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు… ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ… భక్తులు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు…

విజయవాడ, అక్టోబర్ 14: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడ నగరానికి ప్రముఖులు, భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీఐపీల రాకపోకలతో పాటు సాధారణ ప్రజల ప్రయాణాలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, వీఐపీల రాకపోకలు సాగే మార్గాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రద్దీ పెరిగిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు పరస్పరం సమాచారం అందించుకుంటూ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు, సాధారణ వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతున్నారు. అంబులెన్సులు, ఇతర అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రజల ప్రయాణాలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

