కళ్యాణి హత్య కేసులో ఇద్దరికి రిమాండ్
పచ్చబొట్టు ఆధారంగా మృతురాలి గుర్తింపు... ప్రధాన నిందితుడు షఫీతోపాటు అబ్బుల్లా అరెస్టు... అక్టోబర్ 9 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం...

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 29: ఇబ్రహీంపట్నం పరిధిలో జరిగిన కళ్యాణి హత్య కేసులో ప్రధాన నిందితుడు షఫీతోపాటు అతనికి సహకరించిన అబ్బుల్లాను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచగా, అక్టోబర్ 9 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 18న వీటీపీఎస్ కాలువలో మహిళ శరీర భాగాలు లభించాయి. వాటిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతురాలిని కళ్యాణిగా పోలీసులు గుర్తించారు. అనంతరం చేపట్టిన దర్యాప్తులో భవానీపురానికి చెందిన షఫీ ప్రధాన నిందితుడిగా తేలినట్లు సమాచారం. హత్యకు సహకరించిన అబ్బుల్లాను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

