హిందూ సమాజ ఐక్యతకు అశోక్ సింఘాల్ జీవితం స్ఫూర్తి
విజయవాడలో అశోక్ సింఘాల్ శతజయంతి విశిష్ట వ్యక్తుల సమావేశం హిందూ సమాజ సంఘటనకు జీవితాన్ని అంకితం చేశారన్న కోటేశ్వర శర్మ సింఘాల్ ఆశయాలను కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపు

విజయవాడ, సెప్టెంబర్ 27: విశ్వహిందూ పరిషత్ అగ్రనేత శ్రద్ధేయ అశోక్ సింఘాల్ శతజయంతిని పురస్కరించుకుని విజయవాడ మహానగర విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విశిష్ట వ్యక్తుల సమావేశం నిర్వహించారు. శైవ పీఠాధిపతి పూజ్య శ్రీశ్రీశ్రీ శివస్వామి ఆశీర్వచనం అందించారు. ముఖ్యవక్తగా పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త మహామంత్రి కప్పగంతుల కోటేశ్వర శర్మ మాట్లాడుతూ హిందూ సమాజ ఐక్యత కోసం అశోక్ సింఘాల్ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. విశ్వహిందూ పరిషత్ విస్తరణతోపాటు వివిధ విభాగాలను ప్రారంభించి సమాజంలో మార్పునకు శ్రీకారం చుట్టారని తెలిపారు. సాధు సమ్మేళనాల ద్వారా హిందువులంతా ఒక్కటేనని చాటిచెప్పడంతోపాటు కుల వివక్ష, అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేశారని పేర్కొన్నారు. హిందవః సోదరాః సర్వే న హిందుః పతితో భవేత్ మమ దీక్షా హిందూ రక్షా మమ మంత్రః సమానతా అనే సందేశాన్ని సాధుసంతుల ద్వారా సమాజంలోకి తీసుకెళ్లారని వివరించారు. అశోక్ సింఘాల్ కార్యదీక్ష, సంస్థ విస్తరణకు అనుసరించిన విధానం ప్రస్తుత కార్యకర్తలకు ఆదర్శమన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, కేంద్రీయ కార్యకారిణి సభ్యుడు ఎక్కాలి రాఘవులు, భాగ్యనగర్ క్షేత్ర సంఘటన కార్యదర్శి గుమ్మళ్ల సత్యం, క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్, ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ విజయ ఆదిత్య, ప్రాంత అధ్యక్షుడు వబిలిశెట్టి శ్రీవేంకటేశ్వర్లు, ప్రాంత కార్యదర్శి భూపతిరాజు సుబ్బరాజు, ప్రాంత సహ కార్యదర్శి ఫాల్గుణరావు, ప్రాంత కోశాధికారి వలివర్తి దుర్గాప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ సీనియర్ కార్యకర్తలు, సామాజిక ప్రముఖులు, హిందూ బంధువులు హాజరయ్యారు.

