పింఛన్ కానుకతో పేదల ముఖాల్లో ఆనందం
రాజీవ్‌నగర్, ఎల్‌బీఎస్ నగర్‌లో పింఛన్ల పంపిణీ… వృద్ధులకు రూ.4 వేలు.. దివ్యాంగులకు రూ.6 వేలతో ఆసరా… ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారు: బొండా ఉమా…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 1: పేదలు, బలహీన వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా 63వ డివిజన్ రాజీవ్‌నగర్ సెంటర్, 62వ డివిజన్ ఎల్‌బీఎస్ నగర్‌లోని దివ్యాంగుల వసతిగృహంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర సామాజిక భద్రతా పింఛన్‌దారులకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ గతంలో రూ.2 వేలుగా ఉన్న వృద్ధాప్య పింఛన్‌ను రూ.3 వేలకు పెంచారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు దానిని రూ.4 వేలకు పెంచిందన్నారు. దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచి వారికి ఆర్థిక భరోసా కల్పించినట్లు తెలిపారు. మంచానికే పరిమితమైన వారికి నెలకు రూ.10 వేలు, తలసేమియా బాధితులకు రూ.16 వేల పింఛన్ అందిస్తున్నామని

చెప్పారు. పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు క్రమబద్ధీకరణ పట్టాలు అందించి వారి ఆస్తులకు చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు ప్రతి డివిజన్‌లో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తిరుపతమ్మ, పైడి తులసి, డివిజన్ అధ్యక్షుడు అబ్బ వైకుంఠం, కోలా శ్రీనివాసరావు, మోత్కూరు కాసిం, లబ్బ దుర్గ, పైడి శ్రీను, మరియా, మణి యాదవ్‌తోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
