రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామం అభివృద్ధి
ఎక్కడ ఓట్లు ఎక్కువ.. ఎక్కడ తక్కువ అన్నది చూడను.. ప్రతి గ్రామ అభివృద్ధే నా బాధ్యత నాగవరప్పాడులో ఇప్పటికే ఐదు రోడ్లు పూర్తి.. మరో మూడు రోడ్ల నిర్మాణానికి చర్యలు గ్రామంలో ఇప్పటివరకు రూ.78 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టాం: యార్లగడ్డ

గన్నవరం, ఆగస్టు 24: అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని, ఎన్నికల్లో ఎక్కడ ఎక్కువ ఓట్లు వచ్చాయి.. ఎక్కడ తక్కువ ఓట్లు వచ్చాయన్న లెక్కలు చూడకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన బాధ్యతగా భావిస్తున్నానని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ఉంగుటూరు మండలం నాగవరప్పాడులో నాలుగో శనివారం సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ పాల్గొన్నారు. గ్రామస్థులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, అనంతరం స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలో రూ.13 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ‘రెండేళ్ల పాలన–సంక్షేమం–అభివృద్ధి’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గన్నవరం నియోజకవర్గంలో చేపట్టిన పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ నాగవరప్పాడులో గతంలో పర్యటించినప్పుడు గ్రామస్థులు తన దృష్టికి తీసుకొచ్చిన రహదారి సమస్యలను పరిష్కరిస్తూ ఇప్పటికే ఐదు రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. మరో మూడు రోడ్లను మండల పరిషత్, గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరగా, వారం నుంచి పది రోజుల్లో బోరు, పంపు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. స్మశానం వద్ద నీటి సౌకర్యం కల్పించాలన్న విజ్ఞప్తిని జల్జీవన్ మిషన్లో చేర్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలోని ఆలయ అభివృద్ధికి శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు పొందేలా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అర్హతను బట్టి టీటీడీ నుంచి రూ.40 లక్షల వరకు నిధులు సమకూరే అవకాశం ఉందని తెలిపారు. నాగవరప్పాడులో 1,176 మంది జనాభా ఉండగా 746 మంది ఓటర్లు ఉన్నారని, గ్రామంలో ఇప్పటివరకు 1,060 మందికి రక్త పరీక్షలు నిర్వహించినట్లు యార్లగడ్డ వెల్లడించారు. నియోజకవర్గవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 65 వేలకుపైగా ఇళ్లలో పరీక్షలు చేపట్టినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, నీటి ట్యాంకు తదితర పనులకు నిధులు కేటాయించామని, విద్యుత్ సరఫరా మెరుగుదలకు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, రహదారుల మరమ్మతులు, బోరు, మోటారు తదితర పనులు చేపట్టినట్లు వివరించారు. నాగవరప్పాడులో ఇప్పటివరకు సుమారు రూ.78 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్ని పనులు ఆలస్యమవుతున్నప్పటికీ నిధులు అందుబాటులోకి వచ్చిన వెంటనే మిగిలిన పనులను పూర్తి చేస్తామన్నారు. చిన్న గ్రామమైనప్పటికీ నాగవరప్పాడు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, మండల పరిషత్, గ్రామ పంచాయతీ తదితర నిధులను సమన్వయం చేసుకుంటూ మరిన్ని పనులు చేపడతామని చెప్పారు. ఒక్కరోజులో అన్ని సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదని, ఒక్కో సమస్యను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన బాధ్యతని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

