జగ్గయ్యపేటలో ఎన్నికల బందోబస్తుపై డీసీపీ షరీన్ బేగం ప్రత్యేక నిఘా!
పోలీసు బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ట్రాఫిక్ డీసీపీ… ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక… ప్రశాంత పోలింగే లక్ష్యంగా పోలీసు సిబ్బందికి కీలక ఆదేశాలు…

జగ్గయ్యపేట, అక్టోబర్ 31: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగ్గయ్యపేటలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జరిగేలా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల విధులకు నియమించిన పోలీసు అధికారులు, సిబ్బంది మోహరింపు, బందోబస్తు ఏర్పాట్లు, విధుల నిర్వహణ తదితర అంశాలను ఆమె సమీక్షించారు. విధుల్లో ఉన్న సిబ్బందితో నేరుగా మాట్లాడి వారికి కేటాయించిన బాధ్యతలు, భద్రతా ఏర్పాట్ల తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ షరీన్ బేగం మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమకు అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పోలింగ్ సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టిందని డీసీపీ షేక్ షరీన్ బేగం వెల్లడించారు.

