నేపాల్ వరదల్లో కృష్ణా జిల్లా వాసి గల్లంతు.. ఆచూకీ కోసం ముమ్మర చర్యలు
మానస సరోవర్–కైలాస యాత్రకు వెళ్లిన చొప్పవరపు రమేష్... భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన జిల్లా యంత్రాంగం... నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తున్నాం: కలెక్టర్ డీకే బాలాజి...

మచిలీపట్నం, ఆగస్టు 28: నేపాల్‌లో సంభవించిన వరదల నేపథ్యంలో మానస సరోవర్–కైలాస యాత్రకు వెళ్లిన కృష్ణా జిల్లాకు చెందిన చొప్పవరపు రమేష్ ఆచూకీ కోసం జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆయన అక్కడ చిక్కుకున్నట్లు సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు.
కలెక్టరేట్లోని డీఆర్ఓ చాంబర్ నుంచి మీడియాతో మాట్లాడిన కలెక్టర్, రమేష్ కుటుంబ సభ్యులను జిల్లా యంత్రాంగం సంప్రదించి పరిస్థితికి సంబంధించిన వివరాలను సేకరించినట్లు వెల్లడించారు.
రమేష్ ఆచూకీని వీలైనంత త్వరగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలిపారు. నేపాల్ అధికారులతోనూ సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
రమేష్‌కు సంబంధించిన సమాచారం అందిన వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేస్తామని, ఆయన ఆచూకీ కోసం అన్ని స్థాయుల్లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు.

