ఎన్నికలకు కూటమి సిద్ధం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ పురపాలక ఎన్నికలపై హైకోర్టు తీర్పుకు స్వాగతం… విలీన గ్రామాలతో కలిపి 48 వార్డుల్లో ఎన్నికలు… బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యంపై కూటమి కట్టుబడి ఉంటుంది…

గుడివాడ, అక్టోబరు 1: గుడివాడ పురపాలక ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. న్యాయస్థానాల్లో కేసుల కారణంగా ఏళ్లుగా నిలిచిపోయిన ఎన్నికలకు మార్గం సుగమమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అందరూ ఊహించినట్లుగానే హైకోర్టు నుంచి సానుకూల తీర్పు వచ్చిందని, ఇక ఎన్నికలకు సిద్ధమవడమే మిగిలిందన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం విలీన గ్రామాలతో కలిపి మొత్తం 48 వార్డుల్లో గుడివాడ పురపాలక ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించారు. కూటమి శ్రేణులు ఎన్నికలను ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఎన్నికలను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పటివరకు రాజకీయ డ్రామాలు చేసిన వారంతా ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజాతీర్పు కోరుతామని, గుడివాడలో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారని రాము పేర్కొన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. న్యాయపరమైన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూటమి పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యం కల్పించేందుకు కట్టుబడి ఉంటాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు.

