డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నిరసన ర్యాలీ
డీఎస్సీ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: కొడాలి నాని... అక్రమాలను తొక్కిపెడితే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక... గుడివాడలో వైసీపీ శ్రేణులతో భారీ ర్యాలీ.. పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం..

గుడివాడ: డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గుడివాడలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి కొడాలి నాని తన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయినప్పటికీ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ర్యాలీ కొనసాగించారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
డీఎస్సీ వ్యవహారంపై విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కొడాలి నాని ప్రశ్నించారు. అక్రమాలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వాటిని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

