ఎన్నికల అభ్యర్థులకు రక్షణ కల్పించాలి: డాక్టర్ అంబటి
ప్రజా, న్యాయ పోరాటం చేస్తామన్న డాక్టర్ అంబటి… నామినేషన్ల ప్రక్రియలో బెదిరింపులు, అడ్డగింతలపై ఆగ్రహం… అభ్యర్థులకు రక్షణ కల్పించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి…

విజయవాడ, అక్టోబర్ 16: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆయన అనుచరులపై దాడి జరగడాన్ని వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా వైద్య విభాగం చైర్మన్ డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపంద చర్యగా అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా అధికార కూటమి బెదిరింపులు, దాడులు, నామినేషన్ల అడ్డగింతలకు పాల్పడుతోందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. ప్రజల మద్దతుపై నమ్మకం ఉంటే దాడులు, బెదిరింపులకు పాల్పడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించి ప్రజల తీర్పును స్వీకరించాలని అధికార కూటమికి సూచించారు. దాడులు, నామినేషన్ల అడ్డగింతలపై ప్రజాక్షేత్రంలో పోరాటంతో పాటు చట్టపరమైన చర్యల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తామని తెలిపారు. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా ఆశ్రయిస్తామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీ తక్షణమే స్పందించి అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. హింసతో తమ పార్టీ పోరాటాన్ని ఆపలేరని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

