“రేవంత్ అమెరికా టూర్‌కు కేంద్రం రెడ్‌సిగ్నల్.. అసలు కారణమేంటి?”
అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ ప్రశ్నలు... యూకే పర్యటనకు అనుమతించి.. అమెరికా టూర్‌కు ఎందుకు నిరాకరించారో చెప్పాలని డిమాండ్... దేశ ప్రయోజనాలకు భంగం కలిగించేలా గతంలో ఏమైనా చేశారా అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్న...

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందన్న అంశంపై బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ స్పందించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడానికి గల కారణాలను కేంద్రం స్పష్టం చేయాలని ఆయన కోరారు.
రేవంత్ రెడ్డి యూకే పర్యటనకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటనకు మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆయనకు తప్పనిసరిగా అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏమిటో, అలాగే కేంద్రం అనుమతి నిరాకరించడానికి కారణాలేమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ వ్యవహారంపై ఆర్.ఎస్. ప్రవీణ్ పలు ప్రశ్నలు సంధించారు. రేవంత్ రెడ్డి పర్యటన వల్ల దేశ ప్రయోజనాలకు లేదా భద్రతకు భంగం కలిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా సంస్థలు భావిస్తున్నాయా? గతంలో అమెరికా పర్యటన సందర్భంగా దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఏమైనా వ్యవహరించారా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరణ అంశం సాధారణ విషయం కాదని పేర్కొంటూ, దీనిపై ఉన్న సందేహాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయాలని ఆర్.ఎస్. ప్రవీణ్ కోరారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదికగా స్పందించారు.

