కృష్ణమ్మ ఒడిలోకి ‘కలుషిత’ ప్రవాహం!
మోపిదేవి వారపు వద్ద రొయ్యల కంపెనీ వ్యర్థ జలాల విడుదలంటూ గ్రామస్తుల ఆరోపణ... దుర్వాసనతో ఇబ్బందులు.. రొయ్యల ప్రాసెసింగ్లో ఉపయోగించే రసాయనాలపై ఆందోళన... అధికారులు స్పందించి నీటి నమూనాలు పరీక్షించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్...

మోపిదేవి: కృష్ణా నదిలోకి ఓ రొయ్యల కంపెనీ నుంచి కలుషిత నీరు విడుదలవుతోందంటూ మోపిదేవి ప్రాంత గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవి వారపు వద్ద ఉన్న రొయ్యల కంపెనీ నుంచి వ్యర్థ జలాలు కృష్ణా నదిలోకి చేరుతున్నాయని, దీనివల్ల పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కంపెనీ నుంచి బయటకు వస్తున్న నీరు దుర్వాసన వెదజల్లుతోందని, సమీపంలో నివసిస్తున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. రొయ్యల ప్రాసెసింగ్లో ఉపయోగించే రసాయనాలు, ఇతర పదార్థాలతో కూడిన వ్యర్థ జలాలు నదిలోకి చేరుతున్నాయేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా నది నీటిపై అనేక గ్రామాలు ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఇలాంటి వ్యర్థ జలాల విడుదల జరిగితే ప్రజారోగ్యంతో పాటు జలవనరులు, పర్యావరణంపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
సంబంధిత కాలుష్య నియంత్రణ, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు వెంటనే స్పందించి కంపెనీ నుంచి విడుదలవుతున్న నీటి నమూనాలను సేకరించి పరీక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థ జలాలు నదిలోకి విడుదల చేస్తున్నట్లు నిర్ధారణైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే గ్రామస్తులు చేస్తున్న ఆరోపణలపై సంబంధిత కంపెనీ యాజమాన్యం, అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.

