ఓటరు జాబితా పరిశీలనకు ఇంటింటికీ బీఎల్‌వోలు
ఏఎస్‌డీ జాబితాలోని పేర్లను పరిశీలించనున్న బీఎల్‌వోలు… ఎన్టీఆర్ జిల్లాలో 1,23,714 మంది వివరాల పరిశీలన… అక్టోబర్ 16న తుది ఓటరు జాబితా విడుదల…

విజయవాడ, అక్టోబర్ 8: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర నవరణ–2026లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇంటింటి పరిశీలన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ఏఎస్‌డీ జాబితాలో నమోదైన పేర్లను బూత్‌స్థాయి అధికారులు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 15 నుంచి జులై 24 వరకు నిర్వహించిన పరిశీలనలో 1,23,714 మంది పేర్లను ఏఎస్‌డీ జాబితాలో గుర్తించినట్లు తెలిపారు. ఈ జాబితాలోని వివరాలపై బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేపట్టనున్నారు. జులై 31న విడుదలైన ముసాయిదా జాబితాలో జిల్లావ్యాప్తంగా 15,89,731 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పరిశీలన అనంతరం అక్టోబర్ 16న తుది ఓటరు జాబితా విడుదల కానున్నట్లు తెలిపారు.

