చలో విజయవాడ ఎఫెక్ట్.. 46 మందికి నోటీసులు!
విజయవాడ నిరసనలో కీలకంగా వ్యవహరించిన 46 మందికి షోకాజ్ నోటీసులు… వివరణల అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం… నిబంధనల ఉల్లంఘనపై కేసుల నమోదును పరిశీలిస్తున్న పోలీసులు…

విజయవాడ, అక్టోబర్ 3: విజయవాడలో ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్వహించిన ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. నిరసన కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన 46 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిసింది. ఉద్యోగులు ఇచ్చే వివరణలను పరిశీలించిన అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇప్పటికే పలువురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఆందోళన సందర్భంగా అమలులో ఉన్న నిబంధనలు, పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణలపై విజయవాడ పోలీసులు కూడా చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. నిరసనలో పాల్గొన్నవారి పాత్ర, అందుబాటులో ఉన్న దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం కేసుల నమోదుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

