‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు
అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాలని మంత్రులకు లోకేశ్ సూచన ఎన్నికలు వాయిదా పడతాయన్న ప్రచారాన్ని నమ్మవద్దని స్పష్టీకరణ కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని దిశానిర్దేశం

విజయవాడ, సెప్టెంబర్ 23 : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఎన్నికలు వాయిదా పడతాయనే ప్రచారాన్ని నమ్మకుండా క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచించారు. మంత్రులతో నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎన్నికల సన్నద్ధతపై ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికలో ప్రజాబలం, పార్టీ పట్ల నిబద్ధత, గెలుపు అవకాశాలను ప్రధానంగా పరిగణించాలని సూచించారు. ఎన్నికలు వాయిదా పడతాయన్న వైఎస్సార్‌సీపీ నాయకుల వ్యాఖ్యలను పట్టించుకోవద్దని, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని పేర్కొన్నారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశం కూడా త్వరలో పరిష్కారమవుతుందనే ఆశాభావాన్ని లోకేశ్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. కూటమి పార్టీలతో సమన్వయం పాటిస్తూ అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యాచరణపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు సూచించారు.

