గాంధీజీ ఆశయాల ఆచరణే నిజమైన నివాళి
సత్యం, అహింసా మార్గాలు సమాజానికి స్ఫూర్తిదాయకం… సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి కృషిచేయాలి… ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత మార్గాలు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను నిత్య జీవితంలో ఆచరించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు. గాంధీనగర్‌లోని హోటల్ ఐలాపురం ఎదురుగా ఉన్న రవిరామ్ డిజిటల్స్ కార్యాలయం వద్ద మా మిత్ర మండలి ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బొండా ఉమా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

స్వాతంత్ర్య పోరాటంలో అహింసా మార్గంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలను కేవలం జయంతి రోజున స్మరించుకోవడంతో సరిపెట్టకుండా నిత్యం అనుసరించాలని సూచించారు. కార్యక్రమంలో మా మిత్ర మండలి ప్రతినిధులు చింతల రామారావు, చింతల రవికుమార్, మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు, అభిమానులు, నిర్వాహకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

