వర్షం వేళ భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి
అధికారులతో ఈవో శీనా నాయక్ అత్యవసర సమీక్ష నడక మార్గాలు, క్యూలైన్లలో నీరు నిలవకుండా చర్యలు వృద్ధులు, దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలు, లిఫ్టులు అందుబాటులో ఉంచాలని ఆదేశం


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 24: తుఫాను ప్రభావంతో విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల భద్రత, సౌకర్యాలపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె.శీనా నాయక్ ప్రత్యేక దృష్టిసారించారు. గురువారం ఉదయం ఆలయ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి సహాయక, రక్షణ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. భక్తులు నడిచివచ్చే రహదారి, మెట్ల మార్గం, క్యూలైన్ల పరిసరాల్లో వర్షపు నీరు నిలవకుండా ఇంజినీరింగ్, పారిశుద్ధ్య విభాగాలు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షపు నీటితోపాటు రాళ్లు, మట్టి కొట్టుకురాకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. భక్తులు జారిపడకుండా నడక మార్గాలు, క్యూలైన్లలో రబ్బరు చాపలు, తివాచీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని నియమించాలని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, చంటిబిడ్డల

తల్లులను మహామండపం వరకు తీసుకెళ్లి తిరిగి కిందకు చేర్చేందుకు బ్యాటరీ వాహనాలను పూర్తిస్థాయిలో నడపాలని సూచించారు. లిఫ్టులు నిరంతరం పనిచేసేలా సాంకేతిక సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. చలి, వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని అన్నప్రసాద భవనంలో భక్తులకు వేడివేడి ఆహారం అందించాలని, తాగునీటి కేంద్రాల్లో వేడినీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. విద్యుత్ తీగలు, స్తంభాలు, వెలుగు బోర్డుల వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టి విద్యుత్ ప్రమాదాలు, షార్ట్సర్క్యూట్లకు ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రథమ చికిత్స కేంద్రంలో అత్యవసర మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. వర్షం తీవ్రత తగ్గేవరకు అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ భక్తులకు సేవలందించాలని ఈవో ఆదేశించారు. సమావేశంలో ఆలయ అధికారులు, ఇంజినీరింగ్, పర్యవేక్షక సిబ్బంది పాల్గొన్నారు.

