ఎత్తయిన రోడ్డు.. మునిగిన పంట!
నున్న వద్ద గొల్లపూడి–ముస్తాబాదు పంట కాలువ కట్టకు గండి వందలాది ఎకరాల్లో నీటమునిగిన వరి పంట చిన్న కల్వర్టు స్థానంలో వంతెన నిర్మించాలని రైతుల డిమాండ్

విజయవాడ, సెప్టెంబర్ 24: భారీ వర్షాలకు వరద ఉద్ధృతి పెరగడంతో నున్న గ్రామ పరిధిలో గొల్లపూడి–ముస్తాబాదు పంట కాలువ కట్టకు గండిపడింది. వరద నీరు ఒక్కసారిగా పొలాల్లోకి చేరడంతో వందలాది ఎకరాల్లో వరి పంట నీటమునిగినట్లు రైతులు తెలిపారు. చేతికొచ్చే దశలో ఉన్న పంట ముంపునకు గురికావడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నున్న శివారు మట్టి రహదారి అభివృద్ధిలో భాగంగా కొత్తగా తారు రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో పంట కాలువ నీరు వెళ్లేందుకు సుమారు యాభై ఏళ్ల క్రితం చిన్న కల్వర్టు నిర్మించారు. గతంలో వరదలు వచ్చినప్పుడు కల్వర్టు సామర్థ్యానికి మించిన నీరు రహదారిపై నుంచి ప్రవహించేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కల్వర్టుపై ఎత్తుగా రోడ్డు నిర్మించడంతో వరద నీరు ముందుకు వెళ్లే మార్గం లేక కాలువపై ఒత్తిడి పెరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే పంట కాలువ కట్టకు గండిపడి నీరు పొలాల్లోకి చేరిందని పేర్కొంటున్నారు. రోడ్డు నిర్మాణ సమయంలో వరద నీటి ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడమే ముంపునకు కారణమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న కల్వర్టు స్థానంలో నీటి ప్రవాహానికి అనుగుణంగా వంతెన నిర్మించాలని రైతులు కోరుతున్నారు. వంతెన నిర్మించకుండా రోడ్డు పనులు పూర్తిచేస్తే భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అధికారులు వెంటనే గండిని పూడ్చడంతోపాటు పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

