ఏపీలో ఈ నెల 21 నుంచి పత్తి కొనుగోళ్లు
తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 25 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు... 15వ తేదీ తర్వాత కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ల బుకింగ్... పొడవు పింజ పత్తికి క్వింటాకు రూ.8,667 మద్దతు ధర...

అమరావతి, అక్టోబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లో పత్తి రైతులకు ఊరట కలిగించేలా ఈ నెల 21 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఏర్పాట్లు చేస్తోంది. 2026–27 సీజన్‌కు సంబంధించి తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 25 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అందిన సమాచారం. రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరకు విక్రయించుకునేలా చర్యలు చేపడుతున్నారు. పత్తి విక్రయించాలనుకునే రైతులు ముందుగా కపాస్ కిసాన్ యాప్‌లో పంట వివరాలను నమోదు చేసుకోవాలి. అక్టోబర్ 15 తర్వాత కొనుగోలు కేంద్రాల్లో స్లాట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముందస్తు స్లాట్ బుకింగ్‌తో రైతులకు నిరీక్షణ సమయం తగ్గడంతో పాటు కొనుగోళ్ల ప్రక్రియ సులభతరం కానుంది. ఈ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం మధ్యస్థ పింజపత్తికి క్వింటాకు రూ.8,267, పొడవు పింజ పత్తికి రూ.8,667 కనీస మద్దతు ధర ప్రకటించింది. పత్తి రకం, నాణ్యత ప్రమాణాలను బట్టి ధర వర్తించనుంది. రైతులు ఆధార్, పంట నమోదు వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొనుగోలు చేసిన పత్తికి సంబంధించిన నగదు నేరుగా ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

