క్లాప్ డ్రైవర్లను విధుల్లో కొనసాగించాలి
ఐదేళ్లుగా సేవలందిస్తున్న 43 మంది తొలగింపు అన్యాయం… రెండు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి… డ్రైవర్లు లేక పట్టణంలో పేరుకుపోతున్న చెత్త… వ్యాధులు ప్రబలే ప్రమాదం… కలెక్టరేట్ ధర్నాచౌక్‌లో కార్మికుల నిరసన…

మచిలీపట్నం, అక్టోబరు 5: మచిలీపట్నం నగరపాలక సంస్థలో ఇంటింటికీ చెత్త సేకరణ విధులు నిర్వహిస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లను తిరిగి విధుల్లో కొనసాగించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ కృష్ణా జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. డ్రైవర్లకు రావాల్సిన రెండు నెలల పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని కోరింది. ఈ మేరకు సోమవారం క్లాప్ ఆటో డ్రైవర్లు, కార్మిక సంఘాల నాయకులు నగరంలోని అగ్నిమాపక కేంద్రం నుంచి కలెక్టరేట్ సమీపంలోని ధర్నాచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఐదేళ్లుగా ఎండా, వానను లెక్కచేయకుండా, కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి పనిచేసిన డ్రైవర్లను అకస్మాత్తుగా విధుల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. కృష్ణా జిల్లాలో ఇదే కాంట్రాక్టు కింద ఇతర పురపాలక సంస్థల్లో డ్రైవర్లు విధులు నిర్వహిస్తుండగా, మచిలీపట్నంలో మాత్రమే 43 మందిని నిలిపివేయడం కక్షసాధింపు చర్యగా కనిపిస్తోందని ఆరోపించారు. క్లాప్ ఆటోలు తిరగకపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోందన్నారు. వర్షాల సమయంలో పారిశుద్ధ్యం లోపిస్తే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవడంతోపాటు పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ ఉపాధ్యక్షురాలు సీహెచ్ బుల్లెమ్మ మాట్లాడుతూ నగర పారిశుద్ధ్యంలో కీలకపాత్ర పోషిస్తున్న డ్రైవర్లను కొనసాగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకుడు టీ చంద్రపాల్ మాట్లాడుతూ అకస్మాత్తుగా ఉపాధి కోల్పోవడంతో 43 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మచిలీపట్నం కన్వీనర్ సీహెచ్ జయరావు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాజేష్, క్లాప్ ఆటో యూనియన్ నాయకులు తేజ, శ్రీకాంత్, ఉదయ్, హుస్సేన్, నాగరాజు, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

