26,401 పేద కుటుంబాలకు ఆస్తి హక్కులు
రూ.28,110 కోట్ల విలువైన పట్టాలు, హక్కు పత్రాల పంపిణీ... ఒక్కో కుటుంబానికి రూ.60 లక్షల నుంచి కోటి రూపాయలకు పైగా ఆస్తి... పేదల ఆత్మగౌరవానికి పట్టాభిషేకమన్న మంత్రి సత్యకుమార్...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 30: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 26,401 పేద కుటుంబాలకు శాశ్వత ఆస్తి హక్కులు కల్పిస్తూ క్రమబద్ధీకరణ పట్టాలు, హక్కు పత్రాలను పంపిణీ చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో కలిసి ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దశాబ్దాలుగా నివాస స్థలాలపై పూర్తి హక్కుల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాల కలను కూటమి ప్రభుత్వం

సాకారం చేసిందని పేర్కొన్నారు. ఈ పట్టాల ద్వారా లబ్ధిదారులకు రూ.28,110 కోట్ల విలువైన ఆస్తి హక్కులు లభించాయని తెలిపారు. ఒక్కో కుటుంబానికి సగటున రూ.60 లక్షల నుంచి కోటి రూపాయలకు పైగా విలువైన ఆస్తిపై హక్కు కల్పించినట్లు చెప్పారు. పట్టాలతోపాటు పేదలకు ఆత్మగౌరవం, భవిష్యత్తుపై భరోసా లభించిందన్నారు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం ప్రజా సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.

