రెబల్స్ బరిలో ఉంటే సస్పెన్షన్ తప్పదు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చంద్రబాబు గట్టి హెచ్చరిక... నామినేషన్లు ఉపసంహరించుకునేలా చూడాలి.. లేదంటే పార్టీ నుంచి సస్పెన్షన్... కూటమి పార్టీల మధ్య సమన్వయం.. మిత్రధర్మం పాటించాలని దిశానిర్దేశం...

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచే పార్టీ నేతలకు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గట్టి హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. రెబల్స్ నామినేషన్లు ఉపసంహరించుకునేలా చూడాలని, లేకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికతో పాటు కూటమి పార్టీల మధ్య సమన్వయంపై చర్చించారు. ఎన్నికల్లో కూటమి పార్టీలు మిత్రధర్మాన్ని పాటించాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలే లక్ష్యంగా ‘చెప్పాం.. చేస్తున్నాం’ అనేది నినాదం కావాలని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నేతలంతా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

