పుకార్లకు చెక్ బుడమేరు వద్ద నిఘా
కట్ట తెగుతుందన్న ప్రచారంతో అప్రమత్తమైన అధికారులు కొంత కోత ఉన్నా ప్రమాదం లేదని రెవెన్యూ శాఖ స్పష్టీకరణ ముందుజాగ్రత్తగా కట్టపై నివాసితుల తరలింపు

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 25: ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలోని బుడమేరు కట్ట తెగుతుందంటూ ప్రచారం జరగడంతో మండల రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఖాజీ మాన్యం, జిల్లా పరిషత్ పాఠశాల పరిసరాల్లోని కట్టను పరిశీలించి దాని పటిష్టతపై ఆరా తీశారు. కట్టకు కొంతమేర కోత కనిపించినప్పటికీ ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కట్టపై నివాసం ఉంటున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు కౌన్సిలర్ గోపాలరావు స్థానికులకు అందుబాటులో ఉంటూ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. బుడమేరు కట్ట తెగుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని గ్రామ రెవెన్యూ అధికారి అంజయ్య కోరారు. వరద పరిస్థితికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని స్పష్టం చేశారు.

