విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రాము
బేతవోలు మున్సిపల్ హైస్కూల్‌లో ఆకస్మిక తనిఖీ… విద్యాబోధన, మౌలిక వసతులపై ఆరా… విద్యార్థులతో ముచ్చటించి సమస్యలపై ఆరా… మధ్యాహ్న భోజనం, చిక్కీ నాణ్యతను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే… మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఏపీ విద్యావ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే రాము వ్యాఖ్య…

గుడివాడ, అక్టోబర్ 9: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని బేతవోలు మున్సిపల్ హైస్కూల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యాబోధన, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో నేరుగా ముచ్చటించిన ఎమ్మెల్యే పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించడంతో పాటు విద్యార్థులకు అందిస్తున్న చిక్కీని కూడా రుచి చూశారు. భోజన నాణ్యత, పాఠశాల వసతులపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించవచ్చని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే రాము వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.సంధ్య, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

