మహిళల భద్రతకు భరోసా.. సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక
మహిళల భద్రత, నూతన క్రిమినల్ చట్టాలపై పైడిపాకలో అవగాహన... ఓటీపీ, బ్యాంకు వివరాలు అడిగితే చెప్పొద్దు.. పోలీసులకు సమాచారం ఇవ్వండి... అత్యవసరమైతే 112.. సైబర్ మోసానికి గురైతే 1930కు ఫోన్ చేయండి...

ఏలూరు జిల్లా : పోలవరం : ది డెస్క్ : మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణతో పాటు నూతన క్రిమినల్ చట్టాలపై పోలవరం మండలం పైడిపాక గ్రామంలో మంగళవారం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ కె. జయకృష్ణ సూచనలతో సీఐ బి. కృష్ణకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్సై పి. అప్పారావు మాట్లాడుతూ.. పోలీసు, ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్లు చేసి ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు లేదా డబ్బులు అడిగే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ, బ్యాంకింగ్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు సమాచారం అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో 112ను సంప్రదించాలని తెలిపారు.
మొబైల్ ఫోన్ పోయిన సందర్భంలో సీఈఐఆర్ ద్వారా బ్లాక్ చేయించుకునే అవకాశం ఉందని వివరించారు. సీసీ కెమెరాలు, 360 డిగ్రీల కెమెరాల సహాయంతో నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. యువత గంజాయి, మత్తు పదార్థాలు, అక్రమ సారా వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

