గుడివాడ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్
మహిళా సంఘాల ఉత్పత్తులకు ‘మేడ్ ఇన్ గుడివాడ’ బ్రాండ్ లక్ష్యం… నాణ్యతతోపాటు ప్యాకేజింగ్, మార్కెటింగ్‌కు ప్రాధాన్యం… శిక్షణ, యంత్రాల కోసం సీఎస్‌ఆర్ నిధుల అవకాశాలు పరిశీలిస్తామన్న ఎమ్మెల్యే రాము…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, అక్టోబర్ 7: మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు ‘మేడ్ ఇన్ గుడివాడ’ పేరుతో ప్రత్యేక గుర్తింపు కల్పించి, అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లడమే లక్ష్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. బుధవారం గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో మున్సిపల్ ఆర్పీలు, మహిళా సమాఖ్యల కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. సంఘాల కార్యకలాపాలు, ఉత్పత్తుల తయారీ, విక్రయాలు, సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలించిన ఎమ్మెల్యే వారి కృషిని అభినందించారు. నాణ్యమైన ఉత్పత్తితోపాటు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, సరైన బ్రాండింగ్, పటిష్ఠమైన విక్రయ వ్యవస్థ అవసరమని చెప్పారు. మహిళల్లోని ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి, వాటికి తగిన ప్రోత్సాహం అందించడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లకు గుడివాడ ఉత్పత్తులను చేరవేసేందుకు అవసరమైన అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తానని రాము తెలిపారు. ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాలు తదితర ఉత్పత్తుల

తయారీలో వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు. ముఖ్యంగా ఆహార పరిశ్రమలో మహిళలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, స్వయం ఉపాధితోపాటు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఆసక్తి, నైపుణ్యం ఉన్న మహిళలకు ప్రత్యేక శిక్షణ అందించడం, అవసరమైన యంత్రాల సమీకరణకు సీఎస్‌ఆర్ నిధులను వినియోగించే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. ఉత్పత్తుల వివరాలు, తయారీ సామర్థ్యం, మార్కెటింగ్ అవకాశాలు, యంత్రాలు, శిక్షణ అవసరాలతో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వారం రోజుల్లో నిర్వహించే తదుపరి సమావేశానికి ఆ ప్రణాళికతో రావాలని సమాఖ్య ప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా మెప్మా ఆర్పీలు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమావేశంలో పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు వేమూరి ప్రతిమ, బసవేశ్వరరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, నాయకులు లింగం ప్రసాద్, మజ్జాడ నాగరాజు, పొట్లూరి కృష్ణారావు, కార్యదర్శి అంజమ్మ, ఆకునూరి కుమారి, యాస్మిన్, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
