2,500 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారాంతపు ఆరోగ్య క్లినిక్ ప్రారంభం… ఏడు ప్రభుత్వ పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు… ప్రతి సోమవారం భవానీపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఉచిత వైద్య సేవలు… ప్రతి విద్యార్థికి ‘నా ఆరోగ్య నేస్తం’ పేరిట ప్రత్యేక ఆరోగ్య డైరీ…

విజయవాడ, అక్టోబర్ 11: ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడంతోపాటు విద్యార్థుల్లో ముందస్తు ఆరోగ్య పరీక్షలను ప్రోత్సహించేందుకు సుజనా ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యనారాయణ (సుజనా) చౌదరి ఆదివారం వారాంతపు ఆరోగ్య క్లినిక్, పాఠశాల ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. భవానీపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. సాధారణ వైద్యుల సంప్రదింపులతోపాటు సుజనా ఫౌండేషన్ మొబైల్ వైద్య వాహనం సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. త్వరలో ప్రత్యేక వైద్య నిపుణులతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పాఠశాల ఆరోగ్య కార్యక్రమాన్ని తొలుత ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఏడు ప్రభుత్వ పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాలలోని 2,500 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, శరీర ద్రవ్యరాశి సూచిక, రక్త సంబంధిత ఆరోగ్యం, దంత, నేత్ర, మానసిక ఆరోగ్యంతోపాటు బాలికల ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేపట్టనున్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు. ప్రతి విద్యార్థికి ఆరోగ్య డైరీ విద్యార్థుల ఆరోగ్య వివరాలను నమోదు చేసుకునేందుకు ‘నా ఆరోగ్య నేస్తం’ పేరుతో ప్రత్యేక తెలుగు ఆరోగ్య డైరీని అందజేయనున్నారు. ఇందులో ఆరోగ్య పరీక్షల ఫలితాలతోపాటు ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన సూచనలు, సమతుల ఆహారానికి మార్గదర్శకాలు, మంచి స్పర్శ–చెడు స్పర్శపై అవగాహన, అత్యవసర సహాయ ఫోన్ నంబర్లు పొందుపరిచారు. ప్రతి ఆరోగ్య అంశంపై ఐదు సులభమైన సూచనలను అందించనున్నారు. ‘ఇప్పుడు నా ఆరోగ్యం నా చేతిలో’ అనే నినాదంతో విద్యార్థులు తమ ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపేలా ప్రోత్సహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ చిన్నతనం నుంచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందించవచ్చన్నారు. ప్రతి చిన్నారి ఆరోగ్యవంతంగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమానికి సహకరిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, భాగస్వామ్య సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుధా ఉపాధ్యాయుల మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన చిన్నారులు చదువులోనూ మెరుగైన ప్రతిభ కనబరుస్తారని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ కార్యక్రమానికి రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా, రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి, మనీషా డెంటల్ కేర్, ఒరిజిన్, గార్లపాటి డెంటల్ క్లినిక్, మెరోజ్ క్లినిక్, శంకర నేత్ర చికిత్సాలయ సహకారం అందిస్తున్నాయి. విజన్–2030 ద్వారా పది లక్షల మంది జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే సుజనా ఫౌండేషన్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో సాంబశివరావు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, బీజేపీ నాయకుడు పైలా సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

