తోపుడు బండ్లతో ఉపాధికి చేయూత
11వ డివిజన్లో నలుగురు పేదలకు ఉచితంగా అందజేత… కోనేరు అచ్చమాంబ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయం… తోటి వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న ఎమ్మెల్యే గద్దె…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 7: తోటి వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సహకారం అందించాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. బుధవారం 11వ డివిజన్ హైస్కూల్ రోడ్డులో కోనేరు అచ్చమాంబ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పల్లి సూరమ్మ, శివపార్వతి, గిరిడి నారాయణమ్మ, కుమార్‌లకు తోపుడు బండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక తెలుగుదేశం నాయకుడు కోనేరు రాజేష్ ఒక్కొక్కటి సుమారు రూ.13 వేల విలువైన నాలుగు తోపుడు బండ్లను ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. గతంలోనూ తన చేతుల మీదుగా 20కి పైగా తోపుడు బండ్లను పంపిణీ చేశారని తెలిపారు. పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించే సేవా కార్యక్రమాల్లో మరింత మంది భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

తోటి వారికి చేయూత అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పిలుపునకు అనుగుణంగా సేవలందిస్తున్న రాజేష్‌ను అభినందించారు. కోనేరు రాజేష్ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల సహకారంతో పేదలకు ఉపాధి సాధనాలు అందించడంతోపాటు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సేవా కార్యక్రమాల స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో పేరేపి ఈశ్వర్, జాస్తి సురేష్, బంగారు మురళి, మునగాల పిచ్చియ్య, ఎలమంచిలి ప్రసాద్, వల్లూరు సాంబశివరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, గొల్లపూడి నాగేశ్వరరావు, కలగర మాలతి, వల్లభనేని సుగుణ, కొలసాని నాగమణి, కోనేరు కళ్యాణి, గల్లా రవి, రొయ్యూరు శ్రీనివాస్, పాలడుగు దుర్గాప్రసాద్, పామర్తి కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

