విజయవాడలో 424 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
అంబాపురం వద్ద కొత్తపేట పోలీసుల తనిఖీలు… వాహనంలో భారీగా బియ్యం తరలిస్తుండగా గుర్తింపు… అక్రమ రవాణా కోణంలో పోలీసుల దర్యాప్తు…

విజయవాడ, అక్టోబర్ 5: విజయవాడలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. అంబాపురం ప్రాంతంలో ఆదివారం తనిఖీలు నిర్వహించిన కొత్తపేట పోలీసులు వాహనంలో తరలిస్తున్న 424 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు. బియ్యం నిల్వలు, రవాణాకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం వివరాలను పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలియజేసి, వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

