'మార్పు కావాలి' నినాదంతో సీపీఐ పాదయాత్ర ప్రారంభం
దేశ రాజకీయాల్లో మార్పు కోసం ప్రజల్లోకి సీపీఐ ప్రచార యాత్ర బీజేపీ విధానాలపై ఈశ్వరయ్య తీవ్ర విమర్శలు విజయవాడ సమగ్ర అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్

విజయవాడ, ఆగస్టు 6 (వి10టివి): దేశంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య అన్నారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు చేపట్టిన 'బద్లావ్ జరూరీ హై – మార్పు కావాలి' ప్రచార పాదయాత్రను గురువారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని విద్యాధరపురం శేఖర్‌బాబు భవన్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, విద్యా రంగంలో అవకతవకలు పెరిగాయని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, నిరుద్యోగ నిర్మూలన, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మార్పు అవసరమని పేర్కొన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర కూటమి ప్రభుత్వ విధానాలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధిలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమని, నగరంలోని కొండ ప్రాంతాల అభివృద్ధి, ఇళ్ల పట్టాలు, మౌలిక వసతుల కల్పనలో కమ్యూనిస్టు నాయకులు చేసిన కృషిని గుర్తు చేశారు. నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు విజయవాడ సమగ్రాభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని, ఫ్లైఓవర్లు, స్టేడియం నిర్మాణం, కొండ ప్రాంతాల ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పందించకపోతే మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

