ఓటర్ల హక్కులను హరిస్తే సహించేది లేదు
ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ తొలగించిన ఓట్లను పునరుద్ధరించి స్వతంత్ర విచారణ చేపట్టాలి ఎన్నికల సంఘం తీరుపై విజయవాడలో కాంగ్రెస్ నిరసన


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 25: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీనగర్ ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టారు. ఏఐసీసీ, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించి, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై స్వతంత్ర విచారణ జరిపించాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని కోరారు. ఓటర్ల సమాచార నమోదు వ్యవస్థను కేంద్రీకరించి స్థానిక ఎన్నికల నమోదు అధికారుల అధికారాలను పరిమితం చేయడం సరికాదన్నారు. కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదయ్యేందుకు సాంకేతిక నిబంధనలు అడ్డంకిగా మారకుండా చూడాలని కోరారు.

ఎన్నికల నిబంధనల్లో అధికారిక సవరణలు లేకుండానే సాఫ్ట్‌వేర్ పరిమితులను అమలు చేయడానికి ఎవరు అనుమతించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపు ఆరోపణలను న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని శివాజీ కోరారు. ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ స్పందించాలని అన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు మాట్లాడుతూ ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ కూటమి ఎన్నికల్లో లబ్ధి పొందుతోందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలిచేలా పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్, మీసాల రాజేశ్వరరావు, వి గురునాథం, చిలకా విజయ్‌కుమార్, ఎస్‌ఏ అన్సారీ, ఎండీ బేగ్, సాయికృష్ణ, అంబటి రామకృష్ణ, బుదల జోసఫ్, బగ్గ రమణ, ఎస్‌కే బాజీ, నేలపాటి సుభాష్, దమ్ము రాజు, వల్లి మహబూబ్, పార రాజ్, ఎండీ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
