ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా?
కొండ ప్రాంతాల్లో డ్రైనేజీ, తాగునీరు, వీధిదీపాల సమస్యలపై వెలంపల్లి విమర్శలు… ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు, అర్హులకు పింఛన్ల మంజూరులో జాప్యమని ఆరోపణ… పశ్చిమలో రెండో రోజు ‘స్థానిక పోరుకు సిద్ధం’ పర్యటన…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబరు 6: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న తమ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. బెదిరింపులకు భయపడకుండా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ‘స్థానిక పోరుకు సిద్ధం–ప్రజా సమస్యలపై యుద్ధం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రెండో రోజు పాత 45వ, నూతన 41వ డివిజన్ పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యటించారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, డివిజన్ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి తదితరులతో కలిసి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొండ ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువల నిర్వహణ సరిగా లేదని, మంచినీటి పైపులైన్ల లీకేజీలు, వెలగని వీధిదీపాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెలంపల్లి అన్నారు. ప్రమాదకరంగా

ఉన్న కొండరాళ్ల నుంచి నివాసాలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ‘చేయూత’ పథకం నిధులను నిలిపివేశారని, అర్హులైన వృద్ధులు, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదని విమర్శించారు. పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పాలకులు పోటీ పడాలని సవాల్ విసిరారు. తాము శాంతియుతంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నప్పటికీ అధికార పార్టీకి చెందిన కొందరు పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వెలంపల్లి ఆరోపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరారు. ప్రతి డివిజన్‌లో పర్యటిస్తూ సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

